Mallu Bhatti Vikramarka: దేశ సంపదను కొద్దిమందికి కట్టబెట్టేందుకు మోదీ ప్రయత్నం: భట్టివిక్రమార్క

  • మోదీ పాలనపై గాంధీభవన్‌లో చార్జిషీట్ విడుదల
  • జనాభాను విభజించి మతకల్లోలాలు సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నమని విమర్శ
  • కులగణన చేసి సంపదను అధిక శాతం జనాభాకు పంచడమే రాహుల్ గాంధీ ఉద్దేశ్యమని వ్యాఖ్య
Mallu Bhattivikramarka blames PM Modi

కొద్దిమంది తన స్నేహితులు, క్రోనీ క్యాపిటలిస్టులకు మోదీ ప్రభుత్వం దేశ సంపదను కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. మోదీ పాలనపై గాంధీ భవన్‌లో 'నయవంచన పదేండ్ల మోసం - పదేండ్ల విధ్వంసం' పేరుతో కాంగ్రెస్ ఛార్జిషీట్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా భట్టివిక్రమార్క మాట్లాడుతూ... జనాభాను కులాలు, మతాలుగా విభజించి మతకల్లోలాలు సృష్టించేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు.

ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో ఒక రాష్ట్రం మరొక రాష్ట్రంపై దాడి చేసి సంపదను దోచుకునేవని... ఇప్పుడు మోదీ హయాంలోనూ అదే ధోరణి కనిపిస్తోందన్నారు. పదేళ్లుగా ఈ దేశ ప్రజలను మోదీ ప్రభుత్వం ఏవిధంగా మోసం చేస్తుందో చూశామన్నారు. లోక్ సభ ఎన్నికల్లో గెలుపొందేందుకు మోసపూరిత హామీలు ఇస్తోందని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోదీ గతంలో హామీ ఇచ్చారని... కానీ పదేళ్లలో ఈ హామీని నెరవేర్చలేదన్నారు.

ప్రపంచవ్యాప్తంగా పేరుకుపోయిన భారతీయుల నల్లధనాన్ని వెలికి తీసి దేశంలోని పేదవాళ్ల అకౌంట్లో 15 లక్షల చొప్పున జమ చేస్తానని హామీ ఇచ్చారని... కానీ ఇప్పటి వరకు దేశంలో ఏ ఒక్క పేదవాని ఖాతాలో ఆ డబ్బు పడలేదన్నారు. పెద్ద నోట్ల రద్దుతో నకిలీ కరెన్సీని అరికడతామని చెప్పారని... పదేళ్లయిన ఈ హామీకి సంబంధించిన సమాచారం కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని విమర్శించారు.

ప్రధాని మోదీ తన కొద్దిమంది క్రోనీ క్యాపిటలిస్ట్ స్నేహితుల కోసం విదేశీ సంపదను ఎలా దోచిపెడుతున్నారో... రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర నిర్వహించి దేశ ప్రజలకు వివరించారన్నారు. దేశ సంపదను కొద్దిమందికి కట్టబెట్టాలని చూసే మోదీ ఓ వైపు.. కుల గణన చేసి అధిక శాతం ఉన్న జనాభాకు ఈ దేశ సంపదను పంచాలని రాహుల్ గాంధీ మరోవైపు ఈ ఎన్నికల్లో పోరాటం చేస్తున్నారన్నారు.

రాజ్యాంగాన్ని, లౌకికవాదం, ఈ దేశ సంపదను కాపాడేందుకు రాహుల్ గాంధీ నిత్యం ప్రజల్లో తిరుగుతున్నారన్నారు. లౌకికవాదం ప్రజాస్వామ్యం ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు మీడియా ముందుకు రావాలని భట్టివిక్రమార్క విజ్ఞప్తి చేశారు. చార్జి‌షీట్‌లో పేర్కొన్న ప్రతి విషయాన్ని ప్రతి పౌరునికి ఇంటికి చేరే విధంగా కాంగ్రెస్ సైన్యం కృషి చేయాలన్నారు.

More Telugu News